ఇద్దరి చంద్రుల మధ్యలో రామారావు..సెటిల్ మెంట్ సక్సెస్..!

Saturday, December 16th, 2017, 02:01:26 AM IST

భవిష్యత్తు టీఆర్ఎస్ లీడర్ గా మంత్రి కేటీఆర్ ఎదుగుతున్నారు. వారసత్వ ముద్ర తనపై పడకుండా ప్రభుత్వ మరియు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ టిఆర్ఎస్ బాస్ గా ఎదిగేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పకనే చెబుతున్నారు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గడచిన మూడున్నరేళ్ల కాలంలో కేటీఆర్ ఖాతాలో సక్సెస్ లు చాలానే ఉన్నాయి. కీలకమైన ఐటి శాఖని సమర్ధవంతగా నిర్వహించగలనని నిరూపించారు. మున్సిపల్ శాఖ విషయంలో విమర్శలు ఎదురవుతున్న భాద్యత తీసుకుంటున్నారు.

తాజాగా అత్యంత కీలకమైన అంశంలో కేసీఆర్ చేత ఒకే చెప్పించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణాలో టిఆర్ఎస్, టీడీపీ మధ్య పొత్తు ఆశలు చిగురించాయి. టిఆర్ఎస్ కు పొత్తు పెట్టుకునే అవసరం లేదు. ఆ పార్టీ బలంగా ఉంది. కానీ టీడీపీకి మాత్రం పొత్తు అవసరం ఉంది. ప్రస్తుతం టీడీపీ పరిస్థితి ఇక్కడ ఏంటో అందరికి తెలిసిందే. ఈ విషయంలో ఓ అడుగు ముందుకువేసి కేసీఆర్ ని కేటీఆర్ ఒప్పించారనేది లేటెస్ట్ టాక్. తెలంగాణాలో టీడీపీకి నాయకత్వం లేకపోయినా అభిమానులు, కార్యకర్తల రూపంలో బలమైన క్యాడర్ ఉండనే విషయాన్ని అందరూ అంగీకరించాల్సిందే. నాయకత్వ లోపంతో ఇప్పుడు వారంతా ఎవరికి మద్దత్తు తెలపాలనే సంశయంలో ఉన్నారు.

రేవంత్ రెడ్డి మాస్ లీడర్ గా ఎదుగుతున్నారు. అతడు టీడీపీ గూటి నుంచి కాంగ్రెస్ కు వెళ్లాడు. దీనితో కేటీఆర్ తన రాజకీయ చతురత ఉపయోగించినట్లు తెలుస్తోంది. టీడీపీ క్యాడర్ రేవంత్ కు అట్రాక్ట్ కాకుండా చేయడమే కేటీఆర్ ప్లాన్. అందుకు టీడీపీతో పొత్తు పెట్టుకోవడమే సరైన మార్గం అనేది ఆయన అభిప్రాయం. చంద్రబాబుతో విభేదాలు ఉన్నప్పటికీ కేటీఆర్ వాదనతో ఏకీభవించిన కేసీఆర్ పొత్తుకు సూచన ప్రాయంగా అంగీకారం చెప్పినట్లు తెలుస్తోంది. ఇటీవల కేటీఆర్ చంద్రబాబుని ఆకాశానికి ఎత్తేస్తూ ప్రశంసల వర్షం కురిపించారు. హైదరాబాద్ ని ఐటి హబ్ గా తీర్చి దిద్దడంలో చంద్రబాబు పడ్డ కష్టం తనకు తెలుసు అంటూ వ్యాఖ్యానించారు. ఆయన వేసిన ఐటి పునాదుల వలనే నేడు సైబరాబాద్ ఇంత భారీగా విస్తరించిందని చంద్రబాబుని కేటీఆర్ ప్రశంసించిన సంగతి తెలిసిందే. పొత్తు ఆలోచనలో భాగమే ఇందంతా అనే అభిప్రాయం రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.