సీఎం కేసీఆర్‌లా ఏ ప్రధాని ఆలోచించలేదు.. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!

Wednesday, March 24th, 2021, 01:05:43 AM IST


తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌లో రైతువేదికను ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్‌లా ఏ ప్రధాని గానీ, మరే ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా మన సీఎం కేసీఆర్ రైతుల కోసం ఆలోచించారని, రైతుల కోసం అనేక పథకాలు చేపట్టారని అన్నారు.

అయితే రైతుల కోసం రైతు బందు, రైతు భీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందేలా కృషిచేస్తున్నారని, రైతుల కోసం రుణమాఫీనీ కూడా ప్రకటించారని అన్నారు. రాష్ట్రంలో ఆరు నెలల కాలంలో 2,600 రైతు వేదికలను నిర్మించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మన తెలంగాణ దేశానికే అన్నం పెట్టే స్థాయిలో ఉందని ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థనే వెల్లడించిందని గుర్తుచేశారు.