అలా అనలేదు.. జీహెచ్ఎంసీ ఎన్నికల తేదీపై కేటీఆర్ వివరణ..!

Wednesday, September 30th, 2020, 03:38:49 PM IST

జీహెచ్ఎంసీ ఎన్నికలు నవంబర్‌లో వచ్చే అవకాశం ఉందని తాను అన్నట్టు మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. నిన్న గ్రేటర్‌కు సంబంధించిన నేతలతో సమావేశమైన కేటీఆర్ నవంబర్‌ రెండో వారం తరువాత ఎప్పుడైన ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని కాబట్టి అందరూ సిద్దంగా ఉండాలని వ్యాఖ్యలు చేశారు. దీంతో గ్రేటర్‌లో షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరగవచ్చని, ఈ ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతోందన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

అయితే దీనిపై ట్విట్టర్ ద్వారా స్పందించిన కేటీఆర్ నవంబర్‌లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉంటాయని నేను అన్నట్టు కొన్ని మీడియా సంస్థలు రిపోర్టు చేశాయని, జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం నవంబర్ రెండవ వారం తరువాత ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, కనుక పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలని మాత్రమే నేను అనడం జరిగిందని వివరణ ఇచ్చారు. ఎన్నికల షెడ్యూల్ మరియు నిర్వహణ పూర్తిగా ఎన్నికల కమీషన్ పరిధిలోని అంశం అని సదరు మీడియా సంస్థలు నేను అనని మాటలను నాకు ఆపాదించడం జరిగిందని అన్నారు.