ప్రాణ నష్టాన్ని చాలా వరకు తగ్గించగలిగాం – కేటీఆర్

Monday, October 19th, 2020, 03:14:45 PM IST

తెలంగాణ రాష్ట్రం లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ నేపధ్యంలో మంత్రి కేటీఆర్ మరోమారు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ను అధికారులు అప్రమత్తంగా ఉండాలి అని మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని, లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే ఖాళీ చేయించాలి అని సూచించారు. ముంపు ప్రాంతాల ప్రజలకి సామాజిక భవనాలు సిద్దం చేయాలని, అన్నపూర్ణ భోజనం తో పాటుగా, ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలి అని అన్నారు.

అయితే వారికి మొబైల్ టాయిలెట్ లను సైతం అందుబాటులో ఉంచాలి అని తెలిపారు. అయితే మీడియా తో మాట్లాడిన కేటీఆర్ పలు వ్యాఖ్యలు చేశారు. వర్షం పడే అవకాశం ఉన్న చోట ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం అని, ఇప్పటికే వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని, ప్రాణ నష్టాన్ని చాలా వరకు తగ్గించాం అని తెలిపారు. ప్రత్యేక అధికారులను నియమించాం అని అన్నారు. అంతేకాక శిధిలావస్థకు చేరుకున్న భవనాలను కుల్చివేస్తాం అని అన్నారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం అని కేటీఆర్ అన్నారు.