వెరీ షేమ్‌ : మొన్న ఎస్పీబీ.. నిన్న సుశీల‌.. నేడు కోట‌!?

Saturday, November 11th, 2017, 12:15:18 PM IST

షేమ్ షేమ్ షేమ్‌.. వెరీ షేమ్‌.. ! బ‌తికున్న మ‌నిషి చ‌చ్చాడు! అంటే ఆ బాధ ఎలా ఉంటుంది? ఆరోగ్యం బాలేదు.. చివ‌రిక్ష‌ణాల్లో ఉన్నాడు! అంటే ఆ మంట ఎలా ఉంటుంది? కుటుంబీకుల్లో ఆ క్ష‌ణం ఆపుకోలేని ఉద్వేగం త‌న్నుకు రాదూ? బ‌తికుండ‌గాన చంపేశారే! అంటూ ఒక‌టే గుండెలు అవిసిపోతాయి. అలాంటి స‌న్నివేశ‌మే కొంద‌రు సెల‌బ్రిటీల‌కు ఎదుర‌వ్వ‌డం ప‌లుసంద‌ర్భాల్లో తీవ్ర విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది. మీడియా పెనుపోక‌డ‌లు అనాలో, లేక టీఆర్‌పీ గేమ్‌లో ప‌డి విచ‌క్ష‌ణ మ‌రిచార‌నాలో.. లేదూ సామాజిక మాధ్య‌మాల పుణ్య‌మా అని.. ఎవ‌డికి వాడే మీడియా అవ్వ‌డం వ‌ల్ల ఇలాంటి దుష్ప‌రిణామం ఏర్ప‌డింద‌ని అనాలో.. తెలియ‌ని ధైన్యం. బ‌తికుండ‌గానే చంపేస్తున్న ఈ ప్ర‌చారం అత్యంత దారుణం.

మొన్న‌టికి మొన్న ఎస్‌పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం ఆరోగ్యం బాలేదు. అమెరికాలో చికిత్స పొందుతున్నారు.. కాస్త సీరియ‌స్ అంటూ ప్ర‌చార‌మైంది. ఆ క్ర‌మంలోనే బాలు స్వ‌యంగా మీడియా ముందుకొచ్చి వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సొచ్చింది. అయ్యా బాబూ నేనింకా బ‌తికే ఉన్నానంటూ ఆయ‌న‌కు ఆయ‌నే వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. ఇక ఇదే తీరుగా నిన్న‌టిరోజున సీనియ‌ర్‌ గాయ‌ని సుశీల విష‌యంలోనూ ఇదే త‌ర‌హా ప్ర‌చారం మోతెక్కిపోయింది. సామాజిక మాధ్య‌మాల్లో ఉచ్ఛ‌నీచాలు మ‌రిచి ప్ర‌చారం సాగించారు. దాంతో సుశీల మ‌న‌సు గాయ‌ప‌డి స్వ‌యంగా వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. మీడియా స‌మ‌క్షంలో ఆవేద‌న చెందారు. తాజాగా మేటి సీనియ‌ర్ న‌టుడు కోట శ్రీ‌నివాస‌రావు (70) ఆరోగ్యం విషమించిందని, ఆసుపత్రిలో చేరానంటూ సోషల్‌ మీడియాలో ప్రచారమైంది. దీంతో ఆయ‌న కుటుంబం బెంబేలెత్తింది. కోట అయితే తీవ్రంగా హ‌ర్ట‌య్యారుట‌. అస‌త్య ప్ర‌చారం చేశారు నాపై. నాకేం ఆరోగ్య స‌మస్య‌లేం లేవ్‌. ఇలాంటి వార్తల వల్ల నా మనసు బాధపడింది అంటూ ఆవేద‌న చెందారు కోట‌. బంధుమిత్రుల నుంచి ఫోన్‌లు వ‌స్తుంటే బాధ‌ప‌డ్డాన‌ని తెలిపారు. ఇలాంటి వెద‌ల‌పై ప్ర‌భుత్వం ఏదో ఒక చ‌ర్య తీసుకోవాల‌ని అన్నారు. అంటే ఈ స‌న్నివేశం చూస్తుంటే నిజంగానే మీడియా పేరుతో అస‌త్య ప్ర‌చారం ఎంత వేగంగా సామాజిక మాధ్య‌మాల్లోకి వెళ్లిపోతోందో అర్థం చేసుకోవ‌చ్చు. అయితే అక్క‌డ జ‌రిగే ప్ర‌తి రోత ప్ర‌చారాన్ని జ‌నం న‌మ్మేయ‌కూడ‌దు.. అన‌డానికి ఈ త‌ప్పుడు ప్ర‌చారాలు చాల‌వూ?