కరోనా ఉందని కాల్చి చంపేశారు.. కొరియాలో దారుణం..!

Thursday, February 13th, 2020, 08:26:43 PM IST

ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న వైరస్ కరోనా. చైనాలో పుట్టిన ఈ వైరస్ నెమ్మది నెమ్మదిగా అన్ని దేశాలకు వ్యాప్తి చెందుతుంది. అయితే ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే చైనాలో చాలా మంది చనిపోయారు. అయితే ఈ వైరస్ నుంచి ప్రజలను కాపాడుకునేందుకు చైనా ఎంతగానో శ్రమిస్తుంటే, ఉత్తర కొరియా వంటి దేశాలు మాత్రం ఈ వైరస్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయి.

అయితే తాజాగా ఉత్తర కొరియాలో కరోనా సోకిన వ్యక్తిని అక్కడి భద్రత సిబ్బంది కాల్చి చంపేశారు. చైనా నుంచి తాజాగా వచ్చిన ఒక అధికారికి కరోనా లక్షణాలు ఉండడంతో అతడిని ప్రజల మధ్య తిరగనీయకుండా గృహ నిర్బంధం చేశారు. అయితే అక్కడి అధికారుల ఆదేశాలను కాదని ఆ వ్యక్తి ప్రజల మధ్యకు రావడంతో భద్రతా సిబ్బంది అతడిని అక్కడికక్కడే కాల్చి చంపేశారు. అయితే దీనిపై స్పందించిన అధికారులు మాత్రం కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి త్వరగా వ్యాప్తి చెందుతుందని అందుకే కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏది ఏమైనా ఒక మనిషిని ఆ వైరస్ బారి నుంచి రక్షించేదిపోయి, ఇలా కాల్చి చంపడంపై కిమ్ ఉన్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.