అదే జరిగితే బీజేపీలో చేరుతా.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

Sunday, December 6th, 2020, 03:00:58 AM IST

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీనీ వీడి బీజేపీలో చేరబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ అంశంపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఓ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి తనకు పార్టీ మారే ఆలోచనలు లేవని ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ఎస్‌తో కలిస్తే మాత్రం తాను బీజేపీలో చేరతానని కుండబద్ధలు కొట్టి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ నేతల తీరును కూడా తీవ్రంగా తప్పుపట్టారు.

అయితే కాంగ్రెస్ నేతలు క్రమశిక్షణ లేని సైనికులు అని మాట్లాడారు. కొందరు కాంగ్రెస్‌ నేతలు కేసీఆర్‌ జేబులో మనుషులుగా మారారని ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును సంపాదించడంలో తాము వెనుకపడ్డామని, ఎవరికి పీసీసీ ఇచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్న ఒక మాట మీదకు వచ్చామని తెలిపారు. సీఎం కేసీఆర్‌కు పదునైన భాషతో బదులు చెప్పే నేతలే కావాలని అన్నారు. కేసీఆర్‌ దగ్గర చిన్న లాఠీ ఉంటే బీజేపీ వద్ద పెద్ద కర్ర ఉందన్న ఆలోచనల్లో జనం ఉన్నారని, అందుకే ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు.