కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా ఉండలేక పోతుంది – కొండా విశ్వేశ్వర్ రెడ్డి

Sunday, March 28th, 2021, 07:22:36 PM IST

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ తన పట్టును కోల్పోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ను వీడిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరొకసారి తెలంగాణ రాష్ట్ర పరిస్థితుల పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ లో మరో ప్రాంతీయ పార్టీ అవసరం ఎంతైనా ఉందని తేల్చి చెప్పారు. రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాలు అభివృద్ది చెందుతున్నాయి అని, రాష్ట్రం లో మరొక పార్టీ రావాలి అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రత్యామ్నాయ పార్టీ గా, బలమైన ప్రతిపక్షం గా ఉండలేక పోతుంది అంటూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. అయితే దీని వలనే కాంగ్రెస్ పార్టీ నాయకులు అమ్ముడు పోతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసిన అనంతరం పలు పార్టీలతో మాట్లాడినట్లు వివరించారు.

అయితే బీజేపీ లో చేరాలా, లేక కొత్త పార్టీ పెట్టాలా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలా అనే దాని పై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటా అని అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ను వీడి 10 రోజులు అయ్యింది అని, అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చా అంటూ చెప్పుకొచ్చారు. కేసీఆర్ మూడేళ్లు వెంటపడితే వచ్చా అని, తాను అనుకున్న మార్పు కేసీఆర్ తేలేక పోయారు అంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణ ఆర్దికంగా వెనక్కి పోయింది అని, కాగ్ నివేదిక కూడా అదే బయట పెట్టింది అంటూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.