కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి వంటి మాస్ లీడరే సరైనోడు – కొండా సురేఖ

Wednesday, February 17th, 2021, 01:47:11 AM IST


తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాలకు వ్యతిరేకంగా రైతులకు మద్ధతుగా పాదయాత్ర చేపట్టారు. అయితే రేవంత్ రెడ్డి చేపట్టిన రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర ముగింపు నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా రావిరాలలో రాజీవ్ రైతు రణభేరి సభ జరిగింది. అయితే ఈ సభకు హాజరైన మహిళా నేత కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ సీనియర్లపై మండిపడ్డారు.

గతంలో రైతు సమస్యలపై వైఎస్సార్ చేసిన పాదయాత్రకు కూడా అనుమతి లేదన్నారని, ఆయనకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కూడా చూశారని ఆనాడు అడ్డుతగిలినవాళ్లే ఇవాళ రేవంత్ రెడ్డికి కూడా అడ్డుతగులుతున్నారని విమర్శించారు. ఆరోజు వైఎస్ భయపడకుండా పాదయాత్ర చేసి టీడీపీని గద్దె దించి రైతాంగాన్ని ఆదుకున్నారని, ఇప్పుడు రైతుల కోసం పాదయాత్ర చేస్తున్న రేవంత్ రెడ్డికి ప్రతి ఒక్కరూ మద్ధతు ఇవ్వాలని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లాస్ లీడర్ అని, కేసీఆర్‌ లాంటి నేతకు రేవంత్ రెడ్డి వంటి మాస్ లీడరే కరెక్ట్ అని కొండా సురేఖ అభిప్రాయపడ్డారు.