నేను బీజేపీ నుంచి పోటీచేస్తే జానారెడ్డికి మూడో స్థానమే – కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

Thursday, March 18th, 2021, 12:10:53 AM IST


తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు మీడియాతో మాట్లాడుతూ తనను బీజేపీలోకి రమ్మని సంప్రదింపులు జరుగుతున్నాయని, తనని నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో పోటీ చేయాలని, కొన్నిరోజులుగా బీజేపీ నేతలు అడుగుతున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వెల్లడించారు. టీఆర్ఎస్‌ను గద్దె దించాలంటే బీజేపీతోనే సాధ్యమని, ఇదే విషయాన్ని తాను గతంలో కూడా చెప్పానని ఆ మాటకు తాను కట్టుబడి ఉన్నట్టు చెప్పుకొచ్చాడు.

అయితే బీజేపీలో చేరికపై, నాగార్జునసాగర్‌లో పోటీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ఒకవేళ తాను బీజేపీ నుంచి పోటీచేస్తే కాంగ్రెస్ నేత జానారెడ్డి మూడో స్థానానికి పరిమితమవుతారని అన్నారు. ఇకపోతే సీఎం కేసీఆర్ కుటుంబంలోని అంతర్గత కలహాల కారణంగానే మంత్రి కేటీఆర్‌ను సీఎం చేయలేదని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. అయితే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ భావిస్తున్న సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది.