ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదు.. సీఎం కేసీఆర్‌పై మండిపడ్డ కోదండరామ్..!

Saturday, October 10th, 2020, 09:05:50 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ తీవ్రంగా మండిపడ్డారు. ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నిలబెట్టుకోలేకపోయారని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు పెనం మీద ఉంటే, ఉద్యోగులు పొయ్యిలో ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు వెట్టి కార్మికులుగా పనిచేస్తున్నారని, ఉద్యోగులు పని భారంతో ఇబ్బందిపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రజలలో భరోసా కల్పించేందుకే వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టుభద్రుల ఎన్నికలలో పోటీ చేస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్, వామపక్ష పార్టీల మద్దతు కూడగడతామని కోదండరామ్ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికే ఇక్కడ టీఆర్ఎస్ తరపున పల్లా రాజేశ్వర్ రెడ్డి బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థిని బరిలో దింపుతుందా లేక కోదండరామ్‌కు మద్దతు ఇస్తుందా అనేదే తెలియాల్సి ఉంది.