చంద్రబాబుపై మరో సారి నిప్పులు చెరిగిన మంత్రి కొడాలి నాని..!

Monday, January 18th, 2021, 10:32:45 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై మంత్రి కొడాలి నాని మరోసారి నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని ఎన్టీఆర్‌ను సీఎం సీటు నుంచి దించిన వ్యక్తే ఈ రోజు దండలు వేయడం దారుణమని అన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలన్న అంశం ఆయన జయంతి, వర్ధంతి నాడు, మహానాడు సందర్భంలో మాత్రమే చంద్రబాబుకు గుర్తొస్తుందని అన్నారు. చంద్రబాబు బ్రతికుండగా ఎన్టీఆర్‌కు భారతరత్న రాదని విమర్శలు గుప్పించారు.

అయితే టీడీపీకి ఎన్టీఆర్ వ్యవస్థాపకుడైతే చంద్రబాబు, లోకేష్ భూస్థాపితులని మంత్రి కొడాలి ఎద్దేవా చేశారు. ఓట్ల కోసం, పదవి కోసం ఎంత నీచానికైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్టు గురించి చంద్రబాబు నోరు విప్పట్లేదని, టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఓటుకు నోటు కేసులో లోపలేస్తారని భయపడుతున్నారని అన్నారు. అదే కిడ్నాప్ ఏపీలో జరిగి అఖిల ప్రియను అరెస్ట్ చేస్తే చంద్రబాబు నట విశ్వరూపం చూడాల్సివచ్చేదని అన్నారు.

రాజకీయంగా బతకాలంటే చంద్రబాబుకున్న ఏకైక మార్గం గుళ్లను ధ్వంసం చేయించడం, అక్కడికెళ్లి ఆందోళన చేయడమని అన్నారు. సీఎం జగన్ చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి తట్టుకోలేకే గుళ్లు, గోపురాలపై దాడులు చేయిస్తున్నారని అన్నారు. చంద్రబాబు తన హయాంలో పోలీస్‌ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారాని అన్నారు. ఇక తిరుపతిలో వైసీపీ అభ్యర్థికి 4 లక్షల మెజారిటీ రావడం ఖాయమని కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు.