నేను చెప్పిందే రాజ్యాంగం అంటే కుదరదు.. నిమ్మగడ్డపై కొడాలి నాని కామెంట్స్..!

Sunday, October 25th, 2020, 01:13:34 AM IST


ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కరోనా కారణంగా ఏపీలో వాయిదా పడ్డ స్థానిక ఎన్నికలను మళ్ళీ ఇప్పుడు నిర్వహించేందుకు ఎన్నికల కమీషన్ సిద్దమయ్యింది. అయితే ఆనాడు ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఎన్నికలను వాయిదా వేయడంతో ఎస్ఈసీ నిమ్మగడ్డకు, అధికార పార్టీకి పెద్ద యుద్ధమే జరిగింది. అయితే స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పుడు ఎన్నికల కమీషన్ సిద్దంగా ఉన్నా ప్రభుత్వం మాత్రం అందుకు సహకరించడం లేదంటూ మరోసారి నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించారు.

అయితే ఈ మొత్తం వ్యవహారంపై మంత్రి కొడాలి నాని స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేను చెప్పిందే వేదం అనే విధంగా వ్యవహరిస్తున్నారని, నేను చెప్పిందే రాజ్యాంగం అంటే కుదరదని అన్నారు. నిమ్మగడ్డ ఉండేది కొద్ది నెలలు మాత్రమే అని, తర్వాత రిటైర్డ్ అయ్యి హైదరాబాద్‌లో ఉంటారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కన్నా ప్రజల శ్రేయస్సు ముఖ్యమని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహించాలంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలని, ప్రభుత్వం అనుమతి లేకుండా నిమ్మగడ్డ ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రస్తుతం లేదని కొడాలి తేల్చి చెప్పేశారు.