ఉమా కి పది సార్లు ఫోన్ చేసినా స్పందన లేదు

Tuesday, January 19th, 2021, 04:00:30 PM IST

తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా పై మంత్రి కొడాలి నాని మరొకసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.దీక్షకు పోలీసులు ఒప్పుకోరు అని తెలిసి దేవినేని ఉమా దీక్ష నాటకం ఆడారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. దేవినేని ఉమా కి దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలి అంటూ సవాల్ విసిరారు. అయితే నిన్నటి నుండి జరుగుతున్న ఈ పరిణామాల పై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.

మీడియా సమక్షంలో తెలుగు దేశం పార్టీ మేనిఫెస్టో, మా మేనిఫెస్టో గురించి చర్చిద్దామని మంత్రి కొడాలి నాని తెలిపారు. అయితే అక్కడే కొట్టకపోటే తను రాష్ట్రం ను విడిచి వెళ్లి పోతా అంటూ చెప్పుకొచ్చారు. అయితే బహిరంగ చర్చకు తను సిద్ధమే అని, రాత్రి నుండి దేవినేని ఉమా కి పదిసార్లు ఫోన్ చేసినా స్పందన లేదు అంటూ మంత్రి చెప్పుకొచ్చారు. అయితే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సర్వత్రా హాట్ టాపిక్ గా మారాయి. టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు.

ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఖండించారు. దేవినేని ఉమా ను అరెస్ట్ చేయడం దారుణం అని, ప్రజా స్వామ్యం లో నిరసన తెలిపే హక్కు లేదా అని సూటిగా ప్రశ్నించారు. అంతేకాక శాంతి యుతంగా నిరసన తెలుపుతున్న ఉమా ను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలి అంటూ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రం లో ఉన్న సమస్యలను పరిష్కరించకుందా, ప్రజలు దాడి చేస్తారు అనే భయంతో రోజుకో వివాదం తెరపైకి తెస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.