ప్లాఫ్ సినిమాతో 50 ఏళ్ళ రికార్డును బ్రేక్ చేసిన సూపర్ స్టార్..!

Wednesday, January 20th, 2016, 07:52:56 PM IST


మన స్టార్ హీరోలు తమ హిట్ సినిమాలతో రికార్డులను బ్రేక్ చేయడం మనకు తెలిసిన విషయమే. అయితే, సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం తన ప్లాఫ్ సినిమాతో కూడా ఓ రికార్డును బ్రేక్ చేయడం విశేషం. ఆ కథలోకి వెళితే, దాదాపు 50 ఏళ్ళుగా కన్నడ చిత్ర పరిశ్రమలో డబ్బింగ్ సినిమాలపై నిషేధం ఉండగా.. ఇటీవలే ఆ నిషేధాన్ని ఎత్తివేయడంతో 50 ఏళ్ళ తర్వాత కన్నడంలో తొలి డబ్బింగ్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఆ సినిమా వేరే ఏదో కాదు.. రజనీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన ‘కొచ్చాడయాన్’.

ఈ యానిమేటెడ్ సినిమాకు రజనీ కుమార్తె సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహించగా.. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మరాఠి, భోజ్ పురి, బెంగాలీ భాషల్లో ఇప్పటికే రిలీజ్ అయింది. ఇప్పుడేమో కన్నడంలో కూడా రిలీజ్ కు రెడీ అవుతూ అరుదైన రికార్డును సొంతం చేసుకుంటుంది. కాగా, 50 ఏళ్ళ క్రితం 1965లో తెలుగు సూపర్ హిట్ సినిమా ‘మాయాబజార్’ కన్నడంలో అనువాదమైంది. ఆ తర్వాత ఇన్నేళ్ళకు రజనీకాంత్ ‘కొచ్చాడయాన్’ కన్నడంలో రిలీజ్ అవుతూ రికార్డ్ సృష్టించనుంది. దీంతో సూపర్ స్టార్ అభిమానులలో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది.