సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ.. ఏం కోరారంటే..!

Monday, January 25th, 2021, 06:53:48 PM IST

తెలంగాణ సీఎం కేసీఅర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు చేయనున్న జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రంకు స్థలం కేటాయింపు గురుంచి ఈ లేఖ రాశారు. దేశవ్యాప్తంగా శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వైద్య రంగానికి ముఖ్యంగా వైద్య శాస్త్ర పరిశోధనల కోసం అనేక చర్యలు చేపట్టిన విషయం మీకు తెలిసిందేనని అందులో భాగంగా మన రాష్ట్రంలోని హైదరాబాద్‌లో 2019 సంవత్సరంలో జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం ప్రారంభించాలని ప్రతిపాదించి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేసిన విషయం తెలిసిందే అని, దీని కోసం కేంద్ర ప్రభుత్వం నిధులను కూడా కేటాయించిందని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

అయితే దీనికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు స్థలం కేటాయించలేదని, కేంద్ర ప్రభుత్వ అధికారులు 3 ఎకరాల భూమి కావాలని అడిగి ఏడాదిన్నర అవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. ఎన్సీడీసీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసి ఉంటే కరోనాపై పోరాటానికి మరింతగా ఉపయోగపడేదని, కేంద్ర మంత్రితో మాట్లాడి ఎన్సీడీసీ హైదరాబాద్‌కు తీసుకుని వచ్చా, మీరు స్థలం కేటాయిస్తే వెంటనే ఎన్సీడీసీ ఏర్పాటుకు బాధ్యత నేను తీసుకుంటానని, ఇప్పటికైనా స్థలం కేటాయించి పనులు ప్రారంభించేలా చొరవ తీసుకోవాలని లేఖ ద్వారా కిషన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను కోరారు.