గ్రేటర్ ఎన్నికలలో టీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పండి – కిషన్ రెడ్డి

Sunday, November 8th, 2020, 09:11:27 AM IST

రాబోయే గ్రేటర్ ఎన్నికలలో బీజేపీని గెలిపించండని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పిలిపునిచ్చారు. నిన్న రాత్రి శేరిలింగంపల్లి నియోజకవర్గ గ్రేటర్‌ ఎన్నికల సన్నాహాక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కిషన్ రెడ్డి ఐదేళ్లక్రితం మున్సిపల్‌ ఎన్నికలలో గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రాంతంలో నివసిస్తున్న వారందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామన్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏ ఒక్కరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వలేదని ఆరోపించారు. అయితే త్వరలో జరగనున్న గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీకి మేయర్‌ పీఠం కట్టబెడితే ఖచ్చితంగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న పేద ప్రజలందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.

గ్రేటర్‌ పరిధిలో 18లక్షల మంది డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, మరో 18లక్షల మంది ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. అయితే గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పేదలకు ‘మీరు ఎన్నిఇళ్లు కట్టిస్తే అన్ని ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు ఇప్పించడానికి నేను సిద్ధంగా ఉన్నానని ప్రభుత్వానికి చెప్పుకొచ్చారు. ఇటీవల నగరంలో వరదలకు రోడ్లు, బస్తీలు, కాలనీలు, అపార్ట్‌మెంట్లు మునిగిపోయాయని ప్రతి కుటుంబం 40 నుంచి 50 వేల వరకు నష్టపోతే రాష్ట్ర ప్రభుత్వం 10 వేలు చెల్లించడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇక ఇచ్చే ఆ 10 వేలలో కూడా టీఆర్‌ఎస్‌ నాయకులు కమీషన్ల రూపంలో జేబులు నింపుకుంటున్నారని అన్నారు.