కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడాలి – కిషన్ రెడ్డి

Saturday, November 7th, 2020, 02:40:19 AM IST


కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కిషన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అయితే క్సిహన్ రెడ్డి సమక్షంలో మైనారిటీ మహిళలతో పాటు భారీగా యువత బీజేపీలో చేరింది. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి రాష్ట్రంలో కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు.

అంతేకాదు సచివాలయానికి రాని సీఎం కేసీఆర్, సచివాలయం లేని రాష్ట్రం తెలంగాణ అని విమర్శలు గుప్పించారు. అయితే మోదీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం పనిచేస్తుంటే, సీఎం కేసీఆర్ మాత్రం నెలకు 15 రోజులు ఫాంహౌస్‌లోనే ఉంటున్నారని ఎద్దేవా చేశారు. ఇటీవల భారీ వర్షాల కారణంగా నగరంలో వరదలు సంభవించినా కనీసం వరద బాధితులను సీఎం కేసీఆర్ పరామర్శించలేదని, కానీ ఫాంహౌస్‌కు వెళ్లడానికి మాత్రం కేసీఆర్‌కు సమయం ఉంటుందని అన్నారు. పేదలకు, బస్తీవాసులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని జీహెచ్‌ఎంసీలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి వారిని మోసం చేసిందని అన్నారు.