బిగ్‌న్యూస్: కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కేసులో మరో వ్యక్తి సూసైడ్..!

Sunday, November 8th, 2020, 01:30:04 PM IST

కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కేసులో మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల ఈ కేసులో బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన కుషాయిగూడ నాగార్జున కాలనీకి చెందిన కందాడి ధర్మారెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శివనగర్ కాలనీలో చెట్టకు ఉరివేసుకున్నాడు. కాగా ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న ధర్మారెడ్డి కుమారుడు శ్రీకాంత్‌రెడ్డికి బెయిల్ దొరకకపోవడంతో ఇంకా జైలులోనే ఉన్నాడు.

ఇదిలా ఉంటే కీసర మండలం రాంపల్లి దాయర రెవెన్యూ గ్రామ పరిధిలో 28 ఎకరాల భూమిని ధర్మారెడ్డి కుటుంబంతో పాటు మరికొందరి పేరిట నకిలీ పాస్‌ పుస్తకాలు జారీ చేసేందుకు కీసర ఎమ్మార్వోగా ఉన్న నాగరాజుతో ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో ధర్మారెడ్డి నుంచి నాగరాజు రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. దీంతో గత నెలలో చంచల్‌గూడ జైలులో నాగరాజు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే ఇప్పుడు అదే కేసులో నిందితుడిగా ఉన్న ధర్మారెడ్డి కూడా ఆత్మహత్యకు పాల్పడడం హాట్ టాఫిక్‌గా మారింది.