తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కేరళ ప్రభుత్వ సహకారంతో నగరంలోని మలయాళీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం బాలానగర్ లో జరిగిన ‘కేరళీయం -2015’ వేడుకలలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లో నివాసం ఉంటున్న 4లక్షల మంది కేరళీయులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అలాగే నగరంలో నివసిస్తున్న నిరుపేద మలయాళీలకు పక్కా ఇళ్ళు కట్టిస్తామని కెసిఆర్ హామీ ఇచ్చారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ మలయాళీ అసోసియేషన్ భవనం కొరకు హైదరాబాద్ లోని మహేంద్ర హిల్స్ లో ఎకరం భూమిని కేటాయించడంతో పాటు దాని నిర్మాణం కోసం కోటి రూపాయల నిధులను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక తన కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేస్తున్న ప్రియాంక కేరళకు చెందిన అధికారేనని, ఆమె సమర్ధవంతంగా పనిచేస్తోందని కెసిఆర్ కితాబిచ్చారు.