మరోసారి పెద్ద మనసు చాటుకున్న కల్వకుంట్ల కవిత..!

Sunday, August 30th, 2020, 01:07:23 AM IST


మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత దివ్యాంగుడికి సాయం చేసి మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడి నడవలేని‌ స్థితికి చేరిన జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన వినయ్‌ అనే యువకుడికి మూడు చక్రాల స్కూటీనీ అందించింది. ఇటీవల ఓ పత్రికలో వచ్చిన వినయ్ కథనాన్ని చూసి చలించిన కవిత అతడితో నేరుగా మాట్లాడి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చింది.

అయితే కోరుట్లలోని భీమునిదుబ్బ పోచమ్మగుడి సమీపంలో ఉంటున్న బోగ గణేశ్‌, సువర్ణ దంపతుల కుమారుడు వినయ్‌. చిన్ననాటి నుంచి చదువుల్లో బాగా రాణిస్తూ మంచి ర్యాంకులు సాధించేవాడు. 2014లో బీటెక్‌ పూర్తి చేసిన వినయ్ తన అక్కను వారింట్లో దింపేందుకు వెళ్లి వస్తున్న సమయంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి పడిపోయాడు. దీంతో వెన్నెముకకు తీవ్ర గాయాలు కాగా 18 లక్షలు ఖర్చు పెట్టి శస్త్రచికిత్స చేయించినా ఫలితం లేకుండా పోయింది. గత ఆరేళ్లుగా వీల్ చైర్‌కే పరిమితమైన వినయ్ ధీన గాధపై స్పందించిన కవిత కోరుట్ల‌ ఎమ్మెల్యే విద్యా సాగర్‌రావుతో కలిసి వినయ్‌కు మూడు చక్రాల స్కూటీ అందించింది. దీంతో వినయ్ మరియు అతడి తల్లిదండ్రులు కవితకు కృతజ్ఞతలు తెలియచేసుకున్నారు.