సీఎం జగన్ తప్పు చేశారు.. కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు..!

Wednesday, September 30th, 2020, 04:35:09 PM IST

తిరుమల డిక్లరేషన్ వివాదం ఇటీవల ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తిరుమలకు వచ్చే అన్యమతస్తులు ఎవరైనా డిక్లరేషన్ ఇవాల్సిందే అని, సీఎం జగన్ కూడా ఖచ్చితంగా సంతకం చేయాల్సిందేనని హిందూ సంఘాలు, బీజేపీ, టీడీపీ పార్టీలు డిమాండ్ చేశాయి. అయితే సీఎం జగన్ మాత్రం డిక్లరేషన్ ఇవ్వకుండానే శ్రీవారిని దర్శించుకున్నారు. అంతేకాదు సంప్రదాయ వస్త్రధారణలో, నుదట తిరునామంతో శ్రీవారికి పట్టువస్త్రాలు కూడా సమర్పించారు. ఆ తర్వాత ఈ వివాదం కాస్త సద్దుమణిగింది.

అయితే తాజాగా తిరుమల డిక్లరేషన్ వివాదాన్ని తెరపైకి తెచ్చిన నటి కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేసింది. తిరుమల డిక్లరేషన్ విషయంలో వైఎస్ జగన్‌ తప్పు చేశారంటూ మండిపడింది. సీఎం అయినా, పీఎం అయినా తిరుమల నిబంధనలు బ్రేక్ చేసే హక్కులేదని స్పష్టం చేశారు. సీఎం జగన్ క్రిస్టియన్ అని అందరికీ తెలుసని, ఆయన సీఎం అని ఎవరూ ఆపరని తిరుమలకి వెళ్లారా అని ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు డిక్లరేషన్ ఇచ్చి గుడిలోకి అడుగుపెట్టాలి కానీ నాఇష్టం నేను వెళ్తా అంటే ప్రజలకు ఏం సందేశం ఇచ్చినట్టు అని నిలదీశారు. అయితే భారత పౌరురాలిగా దీనిపై ప్రశ్నించడం తన హక్కు అని, త్వరలోనే తాను బీజేపీలో చేరతానని అప్పుడు అన్ని అంశాలపై స్పందిస్తానని స్పష్టం చేశారు.