అధికార పార్టీ నేతలు ఇచ్చే తాయిలాలకి ఆశ పడకుండా ప్రజలు ఓట్లు వేయాలి – కన్నా

Friday, February 26th, 2021, 04:17:01 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో రానున్న మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ – జనసేన విజయం సాధిస్తుంది అని బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల అభివృద్ధి బీజేపీ – జన సేన గెలుపు తోనే సాధ్యం అంటూ చెప్పుకొచ్చారు. బీజేపీ – జన సేన పార్టీ అభ్యర్ధులను గెలిపిస్తే మున్సిపాలిటీల్లో అవినీతి రహిత పాలన అందిస్తామని కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. ఇంటి నిర్మాణం, భూ మార్పిడి, నల్లా కనెక్షన్ కి ఎమ్మేల్యే లు వసూలు చేసే టాక్స్ లేకుండా చేస్తాము అని హామీ ఇచ్చారు. అయితే అధికార పార్టీ ఇచ్చే తాయిలాలకి ఆశ పడకుండా ప్రజలు ఓట్లు వేయాలి అని వ్యాఖ్యానించారు. నిజమైన లబ్ది దారులకి పతాకాలు అందేలా చూస్తామని కన్నా లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు.

అయితే గతంలో జన్మ భూమి కమిటీ ల పేరుతో తెలుగు దేశం పార్టీ, ఇప్పుడు వాలంటీర్ల పేరిట వైసీపీ పార్టీ తమ కార్యకర్తలకు దోచి పెడుతుంది అని వ్యాఖ్యానించారు. పల్నాడు ప్రాంతంలో మా చర్ల, పిడుగు రాళ్ల మునిసిపాలిటి ల్లో స్థానిక ఎమ్మెల్యే లు అరాచకం సృష్టిస్తున్నారు అని అన్నారు. అయితే అక్కడ మరొకసారి నామినేషన్లు వేసేలా ఎన్నికల సంఘం అవకాశం కల్పించాలని కోరిన విషయాన్ని వెల్లడించారు. అయితే ప్రజలు కట్టిన పన్నులు పైసా కూడా వృథా కానివ్వకుండా, వారి కోసమే ఖర్చు చేస్తామని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఓటమి భయం తోనే వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు అని, ప్రభుత్వం నిజంగా ప్రజల కోసమే పని చేస్తే ఇతర పార్టీల నామినేషన్లను ఎందుకు అడ్డుకుంటున్నారు అని సూటిగా ప్రశ్నించారు. అంతేకాక సంక్షేమ పథకాల పేరిట అధికార పార్టీ చేస్తున్న అవినీతి ను ప్రజలు గమనిస్తున్నారు అని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ – జనసేన కూటమి విజయం సాధిస్తుంది అని, గుంటూరు మేయర్ పీఠం తమ కూటమి దే అంటూ ధీమా వ్యక్తం చేశారు.