ఎమ్మెల్సీగా కవిత ఎన్నిక దాదాపు ఖరారైనట్టే..!

Saturday, September 26th, 2020, 08:50:14 AM IST

సీఎం కేసీఆర్‌ కూతురు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ఎన్నికవడం దాదాపు ఖరారైనట్టే కనిపిస్తుంది. నిజామాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కవిత బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఏప్రిల్ 7వ తేదినే ఈ ఎన్నికలు జరగాల్సి ఉన్నా, కరోనా కారణంగా అది వాయిదా పడింది.

అయితే ఈ ఎన్నికకై అక్టోబర్‌ 9న పోలింగ్ నిర్వహించి‌, 12వ తేదిన ఓట్ల లెక్కింపు జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. అయితే ఎన్నికల కోడ్ తక్షణమే అమలులోకి వస్తుందని, ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్‌ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఎక్కువగా టీఆర్ఎస్‌కి చెందిన వారే ఉండడంతో కవిత ఎన్నిక లాంఛనమే అన్నట్టు కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ స్థానం నుంచి 2016లో టీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన భూపతిరెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయన పదవీకాలం ముగియకుండానే ఆయనపై అనర్హత వేటు పడింది. దీంతో ఎన్నికల సంఘం ఉపఎన్నిక నిర్వహణకు పూనుకుంది. టీఆర్‌ఎస్‌ తరఫున కవిత, కాంగ్రెస్‌ నుంచి వడ్డెపల్లి సుభాష్ రెడ్డి, బీజేపీ తరఫున లక్ష్మీనారాయణ ప్రస్తుతం బరిలో ఉన్నారు.