కాల్పుల కలకలం.. నడిరోడ్డుపై కబడ్డీ ప్లేయర్ హత్య

Wednesday, March 16th, 2016, 04:45:50 PM IST

firing
హర్యానాలోని రోహ్ కత్ లో తాజాగా ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్కడ పట్టపగలు నడిరోడ్డుపై ఓ జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపేశారు. ఆ వివరాలలోకి వెళితే, తాజాగా రోహ్ కత్ లో సుఖ్ విందర్ నర్వాల్ అనే కబడ్డీ క్రీడాకారుడు ప్రాక్టీస్ కు వెళ్లి తిరిగివస్తున్న సమయంలో రోడ్డు వెంట నడుస్తూ మొబైల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు.

ఇదే సమయంలో స్కూటర్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు సుఖ్ విందర్ దగ్గరగా వచ్చి తలపై కాల్పులు జరిపారు. వెంటనే బుల్లెట్ తగిలి సుఖ్ విందర్ కిందపడిపోగా, ఆ ఇద్దరు వ్యక్తులు స్కూటర్ దిగి మళ్ళీ అతని తలపై, ఛాతిపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. ఇలా ఒక్కసారిగా అక్కడ కాల్పులు జరగడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ కావడంతో ప్రస్తుతం దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.