నాపై కక్ష్య కట్టారు.. ఏపీ మంత్రిపై జడ్జి సంచలన ఆరోపణలు..!

Friday, October 2nd, 2020, 12:15:02 PM IST

వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చిత్తూరు జిల్లా జూనియర్ సివిల్ జడ్జి రామకృష్ణ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. జడ్జి రామకృష్ణపై ఇటీవల దాడి జరగగా, ఆ దాడిలో మంత్రి పెద్దిరెడ్డి సహకారముందని, మంత్రికి సమీప బంధువైన ఒక హైకోర్టు మాజీ న్యాయమూర్తికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందునే తనను పెద్దిరెడ్డి టార్గెట్ చేశారని విమర్శించారు. అంతేకాదు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనను తను కించపరిచేలా మాట్లాడారని ఆయనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా తన ఫ్యామిలీపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కక్ష కట్టారని, తన కుమారుడిని పోలీసులు కిడ్నాప్ చేశారని ఆరోపించారు. తన కొడుకు కనిపించడం లేదని నిన్న రాత్రి తిరుపతి టీఎంఆర్ సర్కిల్ వద్ద జడ్జి రామకృష్ణ ఆందోళనకు దిగారు. ఈఎన్టీ చికిత్స కోసం మదనపల్లె నుంచి నా కుమారుడు వంశీ కృష్ణతో కారులో తిరుపతి వెళ్ళానని, అయితే ఆస్పత్రిలో ఓపీ తీసుకోవడానికి నేను వెళ్లానని, కారు పార్క్ చేసి వస్తానని చెప్పిన వంశీ కృష్ణ ఎంతకీ రాలేదని, ఫోన్ చేసినా స్పందించలేదని అన్నారు. దీంతో ఓ ఆటోలో తన కుమారుడి కోసం వెతుకుతుండగా టీఎంఆర్ సర్కిల్‌లో కారు కనిపించిందని అయితే అందులో వంశీ లేడని అన్నారు. అయితే కొద్ది సేపటికి అక్కడికి ఓ పోలీస్ వాహనం వచ్చిందని అందులో నుంచి తన కొడుకు దిగాడని, ఏమయ్యిందని ఆరా తీయగా పోలీసులే జీపులో తీసుకెళ్లి, తన ఫోన్ లాక్కున్నట్టు చెప్పాడు. అయితే మంత్రి పెద్దిరెడ్డి, పోలీసులు కలిసి తమపై ఇలాంటి కక్ష్యపూరిత పనులకు పాల్పడుతున్నారని అన్నారు.