జగన్ త్వరలో జైలుకు వెళ్ళడం ఖాయం.. న్యాయాధికారి సంచలన వ్యాఖ్యలు..!

Monday, November 9th, 2020, 07:33:09 AM IST

ఏపీ సీఎం జగన్ త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని న్యాయాధికారి రామకృష్ణ అభిప్రాయపడ్డారు. వైసీపీ పార్టీ కూడా ఆయనతోనే అంతరించిపోతుందని వైఎస్ ముఖం చూసి జనం ఆయనకు ఓట్లేశారని అన్నారు. రాష్ట్రంలో స్వేచ్ఛ, వాక్‌ స్వాతంత్ర్యాలు లేవని.. ఎవరైనా మాట్లాడితే వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎన్నో కేసులు ఎదుర్కొంటున్న జగన్ త్వరలోనే చరిత్రహీనుడు కాబోతున్నారని అన్నారు. అసలు జగన్ రహస్య అజెండా ఏమిటో అందరికి బహిర్గతమైందని, ఆయనపై రాష్ట్రపతికి లేఖ కూడా వెళ్ళిందని అన్నారు.

అయితే న్యాయ వ్యవస్థపైనే జగన్‌ దాడికి సిద్దపడ్డారని, న్యాయవ్యవస్థపై బురదజల్లి నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 2012లో జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి అక్రమాలను బయట పెట్టినప్పటి నుంచి తన వెంటపడి వేధిస్తున్నారని రామకృష్ణ చెప్పుకొచ్చారు. అవినీతి అక్రమాలకు పాల్పడ్డ జస్టిస్‌ నాగార్జునరెడ్డిని ఏపీ ప్రభుత్వం ఈఆర్‌సీ చైర్మన్‌గా నియమించిందని అన్నారు. దళిత న్యాయమూర్తినైన నన్ను జగన్‌ లక్ష్యంగా చేసుకుని, ఎన్నో ఇబ్బందులు పెట్టారని అన్నారు. నాతోపాటు నా సోదరుడిపై కూడా అక్రమ కేసులు పెట్టారని వాటిపై న్యాయపరంగా విచారణ చేస్తే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.