కేసీఆర్ పాలన ఇక ముగిసినట్టే కనిపిస్తుంది – జేపీ నడ్డా

Friday, November 27th, 2020, 11:43:10 PM IST

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. కొత్తపేట నుంచి నాగోల్‌ వరకు జరిగిన రోడ్ షోలో పాల్గొన్న జేపీ నడ్డా టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. గల్లీ ఎన్నికలకు ఢిల్లీ నేతలు వస్తున్నారని కేటీఆర్ విమర్శిస్తున్నారని బీజేపీని గెలిపించేందుకు, కమలాన్ని వికసింపజేసేందుకు తాము ఎక్కడికైనా వస్తామని అవినీతిని పారద్రోలడమే మా లక్ష్యమని నడ్డా కౌంటర్ ఇచ్చారు.

గ్రేటర్‌లో బీజేపీకి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే కేసీఆర్ పాలనకు ఇది ముగింపులా అనిపిస్తోందన్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇప్పుడు మళ్ళీ కొత్త హామీలతో ప్రజలను మభ్యపెడుతుందని నడ్డా ఆరోపణలు చేశారు. తెలంగాణలో ఇక టీఆర్ఎస్ పని అయిపోయిందని, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతున్నారని అన్నారు. గ్రేటర్‌లోని అన్ని డివిజన్లలోనూ బీజేపీని గెలిపించాలని హైదరాబాద్‌ను అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.