నడ్డాతో పవన్ కళ్యాణ్ చర్చించిన ప్రధాన అంశాలు ఇవే..!

Thursday, November 26th, 2020, 12:11:38 AM IST


బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌ భేటీ ముగిసింది. అయితే ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ప్రధానంగా తిరుపతి ఉప ఎన్నిక, ఏపీ పరిణామాలపై చర్చినట్టు చెప్పుకొచ్చారు. తిరుపతి ఉప ఎన్నికలో ఎవరిని నిలబెట్టాలన్న దానిపై ఓ కమిటీనీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. అయితే బరిలో జనసేన అభ్యర్థి ఉంటారా, లేక బీజేపీ అభ్యర్థి ఉంటారా అనేదానిపై మరో రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని పవన్ ‌కళ్యాణ్ స్పష్టం చేశారు.

ఇదే కాకుండా అమరావతి, పోలవరం అంశాలపై కూడా చర్చించామని తెలిపారు. భవిష్యత్‌లో బీజేపీ, జనసేన కలిసి ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై కూడా చర్చించినట్లు పవన్ చెప్పుకొచ్చారు. అమరావతిలో రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ, జనసేన అండగా ఉంటాయని దీనిపై కూడా నడ్డాతో చర్చించినట్టు తెలిపారు. ఇవే కాకుండా రాష్ట్రంలో ప్రభుత్వ అవినీతి, దేవాలయాలపై దాడులు, లా అండ్ ఆర్డర్ గురించి కూడా చర్చించినట్లు పవన్ వెల్లడించారు.