బీజేపీలో చేరిన జీవితారాజశేఖర్.. కండువా కప్పని బండి సంజయ్..!

Tuesday, January 5th, 2021, 02:03:16 AM IST


సినీ నటి జీవితారాజశేఖర్ మళ్ళీ బీజేపీలో చేరారు. గతంలో బీజేపీలో చేరి కొన్నాళ్లు ఆ పార్టీలో కొనసాగిన జీవితారాజశేఖర్ 2019 ఎన్నికల ముందు జగన్‌ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. తాజాగా ఆమె ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి నేడు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. అయితే ఈ సందర్భంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గ్రేటర్‌కు చెందిన కొందరు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. వారితో పాటు బీజేపీలో చేరాలని భావించిన జీవిత బండి సంజయ్ పక్కనే ఉన్నారు.

అయితే కార్యకర్తలకు కూడా బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బండి సంజయ్ పక్కనే ఉన్న జీవితకు మాత్రం పార్టీ కండువా మెడలో వేయలేదు. చివరకు జీవితనే తన మెడలో తాను బీజేపీ కండువా వేసుకున్నారు. అయితే పార్టీ మారిన ప్రతిసారి రాజశేఖర్‌తో కలిసి జంటగా మారే జీవిత ఈసారి మాత్రం సింగిల్‌గానే పార్టీ మారారు. రాజశేఖర్ ఇటీవలే అనారోగ్యం నుంచి కోలుకోవడంతో ఈ రోజు పార్టీ మార్పులో జీవిత పక్కన లేరని తెలుస్తుంది.