రెట్టింపు సత్కారం తీర్చుకోక తప్పదు.. జగన్ సర్కార్‌పై జేసీ మండిపాటు..!

Friday, October 9th, 2020, 04:35:30 PM IST

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. గత కొద్ది రోజులుగా ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయని జేసీ దివాకర్ రెడ్డి నియంత పాలన ఇంకా ఎంత కాలం ఉంటుందో చూస్తానని అన్నారు. తాడిపత్రి గనులు, భూగర్భ కార్యాలయానికి చేరుకున్న జేసీ దివాకర్ రెడ్డి తమ గనులకు అనుమతి ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేస్తానని అధికారులపై సీరియస్ అయ్యారు.

అయితే ఈ ప్రభుత్వం వ్యక్తిగతంగా నా కుటుంబంపై కక్ష సాధింపులకు పాల్పడుతుందని అన్నారు. తన గనులను క్లోజ్ చేసేందుకు స్కెచ్ వేశారని, గనులు తప్ప ఇతర ఆస్తిపాస్తులేమీ నాకు లేవని అదే మాకు అన్నం పెడుతుందని అన్నారు. అధికారులు బదిలీలకు భయపడి తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని, తాను వస్తున్నానని తెలిసి అధికారులు పారిపోయారని అన్నారు. పర్మిట్ల కోసం మరోసారి వస్తానని అప్పటికి పర్మిట్ ఇవ్వకపోతే అన్నం లేకుండా మాడి పైకి పోతామని అన్నారు. అయితే ఇప్పుడు తనకు మీ ప్రభుత్వం చేస్తున్న సత్కారం కంటే రెట్టింపు సత్కారం తీర్చుకోక తప్పదని అన్నారు.