చంద్రబాబుకు నోటీసులు అప్పుడే రావాలి.. జేసీ సంచలన వ్యాఖ్యలు..!

Tuesday, March 16th, 2021, 04:02:17 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఈ రోజు ఉదయం సీఐడీ నోటీసులు ఇచ్చింది. అమరావతిలో అసైన్డ్‌ భూముల వ్యవహారంలో చంద్రబాబు సహా పలువురు నేతలను ఈ నెల 23 వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. అయితే చంద్రబాబుకు నోటీసులివ్వడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఈ వ్యవహారంపై మాజీ ఎంపీ, టీడీపీ కీలక నేత జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే నోటీసులను చూసి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని, మూడు నెలల క్రితమే చంద్రబాబుకు నోటీసులు రావాల్సి ఉండేదని కానీ ఇంత ఆలస్యం ఎందుకు అయ్యిందనేదే అనుమానంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడికి కాబట్టి ఒక పేజీ నోటీసు వచ్చిందని, కానీ మా సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి, ఎంపీ విజయసాయి రెడ్డికి నోటీసులు ఇవ్వాలంటే లారీలు కావాలని అన్నారు. అనంతపురంలో తమ వీపు పగిలినప్పుడు.. చంద్రబాబు పని కూడా చెబుతారని అనుకున్నామన్నాని కానీ ఆలస్యమయ్యిందని అన్నారు. నోటీసులు, అరెస్ట్‌లు రెండున్నర ఏళ్ల క్రితమే మొదలు కావాలని ఇవన్నీ సర్వ సాధారణమని జేసీ వ్యాఖ్యానించారు. ఇక తాడిపత్రిలో టీడీపీ విజయానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇమేజే కారణమని చెప్పుకొచ్చారు.