అమరావతి కోసం ఆమరణ దీక్ష.. మాజీ ఎంపీ జేసీ సంచలన వ్యాఖ్యలు..!

Saturday, January 2nd, 2021, 11:05:03 PM IST

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తరచూ తన కామెంట్స్‌తో వార్తల్లో నిలిచే జేసీ దివాకర్ రెడ్డి తాజాగా రాజధాని అమరావతి ఉద్యమంపై హాట్ కామెంట్స్ చేశారు. ఏపీ రాజాధానిగా అమరావతే కొనసాగాలని ఏడాదుకి పైగా ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కొందరు వృద్ధనేతలు ప్రజలను రెచ్చగొట్టడం తప్ప సాధించిందేమీ లేదని అన్నారు. అమరావతి కోసం ఆమరణ దీక్ష చేయడం తప్ప మరోదారి లేదని, స్పందన రాని ఉద్యమం చేసి వృధా అని, ఉద్యమం బలపడాలంటే ప్రాణత్యాగానికైనా సిద్ధం కావాలని జేసీ పిలుపునిచ్చారు.

అయితే రాజధాని ఉద్యమం చేస్తున్న ప్రజలు కోరితే తాను అమరావతి కోసం ఆమరణ దీక్ష చేస్తానని అన్నారు. అమరావతి కోసం తాడిపత్రిలో నా తమ్ముడితో కలిసి ఈ నెల 4వ తేదీ నంచి దీక్ష చేస్తానని జేసీ అన్నారు. తాను ఉద్యమానికి దిగితే వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, తనతో పాటు 70ఏళ్లు దాటిన నేతలంతా కలిసిరావాలని పిలుపునిచ్చారు. తనను దీక్ష చేయకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం, పోలీసులు అరెస్టులు చేస్తే చేసుకోవాలని జేసీ సవాల్ విసిరారు. అయితే జేసీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారాయి. 70ఏళ్లు దాటిన నేతలంటూ చంద్రబాబునే ఉద్దేశించి మాట్లాడారని, చంద్రబాబును ఆమరణ దీక్ష చేయాలని పరోక్షంగా జేసీ డిమాండ్ చేసినట్లు అర్ధమవుతుంది.