కుప్పంలో టీడీపీ ఓటమికి అదే కారణం.. తేల్చి చెప్పిన జేసీ..!

Tuesday, February 23rd, 2021, 05:00:14 PM IST

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం జగన్ ఒక్క రోజు ఆదాయం రూ.300 కోట్లు అని, ఈ అంశంపై ప్రజల్లో ఎక్కువగా ప్రచారం జరుగుతుందని అయితే ఇందులో వాస్తవం ఎంతో తనకు తెలియదని అన్నారు. వైసీపీ చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను చూసే ప్రజలు పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ మద్ధతుదారులను గెలిపించారనడంలో నిజం లేదని అవన్ని దొంగ మాటలని జేసీ ఆరోపించారు.

అయితే రాజకీయాలు కలుషితం అయ్యాయని, ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బులు లేనిదే ఎన్నికల్లో ఎవరూ గెలవలేరని అన్నారు. అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేస్తారనుకోవడం పొరపాటేనని జేసీ చెప్పుకొచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారని, అయినా వైసీపీతో పోటీ పడి డబ్బులు ఇవ్వలేక ఓడిపోయారని, అధికార పార్టీ డబ్బుకు తోడు పోలీసులు కూడా ఓటర్లను భయబ్రాంతులకు గురిచేశారని అందుకే కుప్పంలో టీడీపీకి ఓటమి తప్పలేదని జేసీ అన్నారు.