నిమ్మగడ్డ ఉన్నంత వరకు ఎన్నికలు జరగవు.. కుండబద్ధలు కొట్టి చెప్పిన జేసీ..!

Thursday, November 19th, 2020, 09:14:29 PM IST

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై అటు ప్రభుత్వానికి, ఎస్ఈసీకి మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై మరోసారి స్పందించిన మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఉన్నంత కాలం స్థానిక సంస్థల ఎన్నికలు జరగవని కుండబద్దలు కొట్టి చెప్పారు. పంతం, పట్టింపుతో ఈ ప్రభుత్వం పోతోందని అన్నారు.

అయితే ఎన్నికల కమీషనర్‌గా కనగరాజ్‌ను నియమించుకున్నాక ఇష్టానుసారం ఎన్నికలు జరుపుకుంటారని ఆరోపించారు. గతంలో ఏకగ్రీవమైన వాటన్నింటిని కరెక్ట్ అంటూ కనగరాజుతో ఆదేశాలు వచ్చేలా చేస్తారని, ప్రతిపక్ష పార్టీలు నామినేషన్లు వేస్తే పోలీసు బలంతో బెదరింపులకు గురిచేసి విత్ డ్రా చేయిస్తారన్నారు. ప్రజాభిమానం తమకు ఉన్నా, వన్ సైడ్‌గా ఎన్నికలు జరుగుతాయని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీలు పోటీ చేయకపోవడమే బెటర్ అని, ఒకవేళ పోటీ చేసి గెలిచినా ఏదో ఓ కేసు పెట్టి లోపల వేస్తారని చెప్పుకొచ్చారు.