సంచలనం సృష్టించిన జయ, మమతా..!

Saturday, May 17th, 2014, 12:17:04 PM IST


రాజకీయాల్లో జయలలిత.. మమతాబెనర్జీ.. ఇరువురూ ఎవరికి వారే వీరవనితలు. తాము నడిచిందే బాట, చెప్పిందే వేదం, ఇదీ వీరి వరస. కిందపడ్డా మాదేపైచేయి అనే ఈ అగ్గిబరాటాలు. లోక్ సభ ఎన్నికల్లోనూ సత్తాచాటారు. తమ రాష్ట్రాల్లోని అన్ని లోక్ సభ స్థానాల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేసి తమంటే ఏంటో మరోమారు చూపించారు.

జయలలిత, మమతా బెనర్జీలు తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని లోక్ సభ స్థానాల్లో తిరుగులేని ఆధిపత్యం సాధించారు. దేశవ్యాప్తంగా ఎంత ఉదృతంగా బీజేపీ పవనాలు వీచినా, సొంత ప్రాంతాల్లో తమదే పైచేయి అని నిరూపించారు. 2011లో తమిళనాట విజయఢంకా మ్రోగించి అధికారంలోకి వచ్చిన ఏఐడీఎంకే అధినేత్ర జయలలిత హవా ఇప్పుడుకూడా తమిళనాడులో ఏమాత్రం తగ్గలేదు. 2014 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆమె నేతృత్వంలోని ఏఐడీఎంకే అనూహ్యఫలితాలు సాధించి తమిళ ప్రజ తనవైపే ఉన్నారని చాటిచెప్పింది. తమిళనాడు లోని 39 లోక్ సభ నియోజకవర్గాల్లో 35 స్థానాల్లో జయలలిత పార్టీ విజయశంఖం పూరించింది. తన ప్రధాన ప్రత్యర్థి డీఎంకేను మరోమారు చావుదెబ్బ కొట్టింది. దీంతో ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో తమిళనాడులో అన్నాడీఎంకే తిరుగులేని ఆధిపత్యాన్ని సాధిస్తుందని వచ్చిన ఎగ్జిట్ పోల్ సర్వేలు నిజమయ్యాయి.

ఇక, పశ్చిమ బెంగాల్ లో మొత్తం 42 స్థానాలుండగా, 34 స్థానాల్లో విజయబావుటా ఎగురేశారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. దేశవ్యాప్తంగా బీజేపీ, మోడీ హవా కొనసాగినా, తన ప్రాభవాన్ని ఏమాత్రం కోల్పోలేదు మమత. లోక్ సభ ఎన్నికల్లో తమకు తిరుగులేదని మమతా బెనర్జీ వ్యక్తం చేసిన ధీమా తూచ తప్పక నిజమైంది. 2009 సాధారణ ఎన్నికల్లో 19 పార్లమెంట్ సీట్లు సాధించిన మమత 2014 సార్వత్రిక ఎన్నికల్లో తన ప్రాభవాన్ని మరింత విస్తృత పరిచారు. సీపీఎం ను మరోసారి చావుదెబ్బ తీశారు.

ఎవరెన్ని చెప్పినా, ఎంత ప్రచారం సాగించినా బెంగాల్ లో తమదే విజయమన్న మమతా అనుకున్నది సాధించారు. అయితే, కేంద్రంలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటులో తృణమూల్ కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుందని, తమ పార్టీ మద్దతు లేకుండా ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు మాత్రం వోమ్మయ్యాయి. ఎవరి సహకారం లేకుండానే బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల మ్యాజిక్ ఫికర్ కు రీచ్ అయింది. కేంద్రంలో తాను అధికారంలో ఉండి ఉంటే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని జైలుకు పంపించి ఉండేదాన్ననని మమతా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అగ్గిబరాటా మమతా బెనర్జీ.. నీతివంతురాలనే ప్రచారం శారదా స్కాం ను కూడా మరుగున పడేలా చేసింది.