టీటీడీ కొత్త ఈవోగా జవహర్ రెడ్డిని నియమించిన ఏపీ సర్కార్..!

Thursday, October 1st, 2020, 04:02:47 PM IST

తిరుమల తిరుపతి దేవస్థాన కొత్త ఈవోగా ఏపీ ప్రభుత్వం జవహర్ రెడ్డిని నియమించింది. ప్రస్తుతం ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్‌ రేపు రిలీవ్ కానున్నారు. 1993 బ్యాచ్‌‌కు చెందిన అనిల్ కుమార్ సింఘాల్‌ను 2017 మే నెలలో టీటీడీ ఈవోగా అప్పటి టీడీపీ ప్రభుత్వం నియమించింది. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ రెండేళ్ళ పదవి కాలం 2019లోనే ముగిసినా వైసీపీ ప్రభుత్వం ఆయనను ఈవోగా కొనసాగిస్తూనే వచ్చింది.

అయితే తాజాగా ప్రభుత్వం అనిల్ సింఘాల్‌ని ఆ పదవి నుంచి తప్పిస్తూ జవహర్ రెడ్డికి కట్టబెట్టింది. ప్రస్తుతం జవహర్ రెడ్డి రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. కరోనా సంక్షోభ సమయంలో ఆరోగ్యశాఖ తరపున ఆయన కీలకంగా వ్యవహరించారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ఉదృతి తగ్గడంతో ఆయనను ప్రభుత్వం టీటీడీ ఈవోగా బదిలీ చేసింది. అయితే ఈ నెల 9న ఆయన కొత్త ఈవోగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. కాగా కొత్త ఈవో బాధ్యతలు స్వీకరించేవరకు టీటీడీ ఈవోగా అదనపు ఈవో ధర్మారెడ్డి బాధ్యతలు నిర్వహించనున్నారు.