ఇండిపెండెంట్ గా జస్వంత్ సింగ్

Sunday, March 23rd, 2014, 03:49:20 PM IST


రానున్న ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారం దక్కించు కోవాలని బీజేపీ తహతహలాడుతోంది. అందులో భాగంగా బీజేపీ కొత్తవారిని ప్రత్యర్ద పార్టీల వారిని తమ పార్టీలోకి ఎటువంటి అభ్యంతరం లేకుండా చేర్చుకుంటోంది. అయితే వారిని చేర్చుకోవటమే కాకుండా పార్టీ లోని సీనియర్ లను కాదని వారికీ టికెట్ లను కూడా కేటాయించడంతో వారు పార్టీని వీడతారు అనే సందేహం కలుగుతుంది.

ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీ లో చేరిన సొనారం చౌదరికి రాజస్దాన్ లోని బర్మేర్ నుంచి కూడా టికెట్ లభించింది. ఇది బీజేపీ పార్టీ లోని జస్వంత్ సింగ్ కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. జస్వంత్ సింగ్ బీజేపీ లో సీనియర్ నాయకుడే కాకుండా బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్ధిక, విదేశాంగ వంటి కీలక పదవులను ఎంతో సమర్దవంతంగా నిర్వర్తించారు.

జస్వంత్ సింగ్ తన సొంత జిల్లా బర్మేర్ నుంచి పోటీ చెయ్యాలని భావించారు. ఈ లోపే కాంగ్రెస్ నుంచి బీజేపీ లో చేరిన సోనారం కు ఆ నియోజక వర్గ టికెట్ కేటాయించడంతో జస్వంత్ సింగ్ ఇండిపెండెంట్ గా పోటీ చెయ్యాలని భావిస్తున్నట్లు సమాచారం. రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఆయన నామినేషన్ వెయ్యనున్నట్లు సమాచారం. బర్మేర్ టికెట్ విషయం లో తీవ్ర ఆగ్రహంతో ఉన్న జస్వంత్ సింగ్ బీజేపీని వీడనున్నట్లు తెలుస్తోంది.