సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి కుమారుడికి కీలక పదవి కట్టబెట్టిన జగన్ సర్కార్..!

Thursday, December 10th, 2020, 12:30:23 AM IST

సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కుమారుడికి జగన్ సర్కార్ కీలక పదవి కట్టబెట్టింది. జాస్తి చలమేశ్వర్ కుమారుడు జాస్తి నాగభూషణ్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అడిషనల్ అడ్వొకేట్ జనరల్‌గా నియమిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుబ్రమణ్యం శ్రీరామ్ అడ్వొకేట్ జనరల్‌గా ఉన్నారు.

అయితే ఈయన తర్వాత జాస్తి నాగభూషన్ అడిషనల్ అడ్వొకేట్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. అయితే గత కొద్ది రోజులుగా జగన్ ప్రభుత్వానికి కోర్టుల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ సమయంలో సుప్రీంకోర్టు మాజీ జడ్జి కుమారుడిని అడిషనల్ అడ్వొకేట్ జనరల్‌గా నియమించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే 2016లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అడిషనల్ అడ్వొకేట్ జనరల్‌కు నెలకు 40 వేల వేతనం, ఆయన వాహనం అలవెన్స్ కొరకు 25 వేలు, రిట్ పిటిషన్లు, కంటెంప్ట్ కేసులు, సీఆర్పీలు, ఇతర చిన్న కేసులకు సంబంధించి కోర్టులో హాజరైనందుకు ఒక్కో వాయిదాకు 7,500, సుప్రీంకోర్టులో ఒక్కసారి కేసు హియరింగ్‌కు అటెండ్ అయితే 1,50,000 చెల్లిస్తారని తెలుస్తుంది.