ఆస్ట్రేలియాపై టెస్ట్ సిరీస్ గెలుపు ఓ అద్భుతం – పవన్ కళ్యాణ్

Tuesday, January 19th, 2021, 10:18:36 PM IST


ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ గెలిచిన భారత జట్టుపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. జట్టులో సీనియర్లు లేకున్నా, గాయాలు ఇబ్బంది పెడుతున్నా ప్రతికూల పరిస్థితుల్లో యువ ఆటగాళ్లు సమిష్టిగా పోరాడి టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆటగాళ్లు, సినీ, రాజకీయ నాయకులు టీమిండియాకు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా టీమిండియా విజయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాపై ఆ దేశంలోనే సిరీస్ సాధించడం చారిత్రాత్మకమని అన్నారు.

అంతేకాదు బ్రిస్బేన్ మైదానంలోని టెస్టులో గెలిచిన తీరు ఓ అద్భుతమని భారత జట్టుకు జనసేన తరపున అభినందనలు తెలియచేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ తెలిపాడు. ప్రతికూల పరిస్థితుల్లో సాధించిన ఈ విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని, కీలక ఆటగాళ్ల గాయాల పాలైనా.. అంతర్జాతీయ వేదికపై తొలి అడుగులు వేస్తున్న క్రీడాకారులు చూపిన ప్రతిభ, విజయం కోసం కలిసికట్టుగా పోరాడిన విధానం ప్రశంసనీయమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.