కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నేనే సీఎం అభ్యర్థిని.. జానారెడ్డి కీలక వ్యాఖ్యలు..!

Thursday, December 10th, 2020, 03:00:13 AM IST

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి జానారెడ్డి పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. ఇటీవల నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణించడంతో ఈ స్థానానికి కూడా ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. అయితే దుబ్బాక ఉప ఎన్నిక గెలుపు, జీహెచ్ఎంసీలో మెరుగైన ఫలితాలు సాధించి ఊపు మీద ఉన్న బీజేపీ జానారెడ్డితో పాటు ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డిని తమ పార్టీలోకి తీసుకురావాలని, అలా చేస్తే దుబ్బాక తరహా ఫలితం నాగార్జునసాగర్‌లో కూడా వస్తుందని కమలనాథులు ప్రయత్నిస్తున్నారని ఈ మేరకు జానారెడ్డితో పలువురు బీజేపీ నేతలు టచ్‌లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది.

అయితే టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసే కసరత్తులో ఉన్న ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ తాజాగా జానారెడ్డికి ఫోన్ చేసి పార్టీ మార్పు అంశంపై అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ తాను పార్టీ మారుతున్నట్టుగా తప్పుడు ప్రచారం జరుగుతోందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తాను సీఎం అభ్యర్థిని అని, అలాంటి నేను ఎందుకు పార్టీ మారతనని ఎదురు ప్రశ్నించారని తెలుస్తుంది. ఇక తనను ఏ పార్టీ సంప్రదించలేదని, నాగార్జునసాగర్‌లో ఎవరు పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇక పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ అన్ని అంశాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తుంది.