టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి..!

Tuesday, November 17th, 2020, 02:08:14 AM IST

టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు చనిపోతే పరిహారం ఇచ్చే స్కీం తెచ్చారు కానీ బతికి ఉండటానికి మాత్రం పథకాలు తేలేదని అన్నారు. రైతు ఆత్మహత్యలను పోలీస్‌లు రికార్డ్ చేయడం లేదని, వాటిని రికార్డ్ చేయకూడదని ప్రభుత్వం నుంచి అదేశాలున్నాయని ఆరోపణలు చేశారు.

అయితే వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చే ఒక్క మాట కూడా కేసీఆర్ ఏనాడు చెప్పలేదని, ఆయన కుటుంబానికి రైతుల శాపం తగులుతుందని అన్నారు. ఖజానా లేదని ప్రజల మీద ఎల్ఆర్ఎస్ భారం వేయడానికి ప్రభుత్వానికి సిగ్గుండాలని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలున్నాయని వరద బాధితులకు 500 కోట్లు పరిహారం ఇచ్చారని, రైతులకు ఎందుకు పరిహారం ఇవ్వలేదని అన్నారు. రైతులకు పరిహారం ఇవ్వకపోతే రైతులతో కలిసి వచ్చి ప్రగతి భవన్ ముందు దీక్షకు దిగుతానని హెచ్చరించారు.