టీఆర్‌ఎస్‌తో బీజేపీకి చీకటి ఒప్పందం.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు..!

Saturday, December 12th, 2020, 01:30:24 AM IST

రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చీకటి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపణలు చేశారు. అయితే సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో మాత్రమే బీజేపీనీ విమర్శిస్తారని, ఆ సమయంలో మాత్రమే ఫెడరల్ ఫ్రంట్ గురుంచి మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. ఇక్కడ బీజేపీనీ తిడుతూ, ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోదీనీ కలుస్తారని అన్నారు.

అయితే తెలంగాణలో కొత్త సచివాలయాన్ని కడుతున్నారన్న కారణంగానే ప్రధాని మోదీ నిర్మిస్తున్న పార్లమెంట్ భవనాన్ని సీఎం కేసీఆర్ సమర్ధిస్తున్నారని అన్నారు. ఆరేళ్లుగా తన సంగారెడ్డి నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదని అలాంటి కేసీఆర్‌ తాను లేనిదే తెలంగాణ లేదని చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటని, ఇది నిజంగా కేసీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ ఈ రోజు ఇలా మాట్లాడేవాడా అని ప్రశ్నించారు.