పీసీసీ చీఫ్ రేసులో నేను ఉన్నా.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు..!

Monday, December 7th, 2020, 06:35:02 PM IST

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి రేసులో నేను కూడా ఉన్నానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర కొత్త అధ్యక్షుడి కోసం కసరత్తు నడుస్తుందని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే మెడిసిన్ తన దగ్గర ఉందని అన్నారు. అయితే పీసీసీ అధ్యక్షుడికి డబ్బులు ఉండాలనేది తప్పుడు అభిప్రాయమని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నేతల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నా కలిసికట్టుగా ఉంటామని స్పష్టం చేశారు.

ఇక కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను కూడా జగ్గారెడ్డి తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌కు కొమ్ముకాస్తోందని అంబానీ, ఆదానీ, అమెజాన్‌కు లాభం చేయడానికే రైతులను నాశనం చేసేలా కొత్త చట్టం తెచ్చారని, ఈ చట్టం వల్ల రైతులు లేకుండా పోతారని అభిప్రాయపడ్డారు. రైతు సంఘాల భారత్ బంద్‌కు కాంగ్రెస్ మద్దతు తెలుపుతుందని, తాను సంగారెడ్డి హైవేపై కూర్చుని నిరసన తెలుపుతానని ప్రకటించారు.