అవినీతిపై ఉక్కుపాదం.. సీఎం జగన్ మరో కీలక నిర్ణయం..!

Monday, August 24th, 2020, 11:59:07 PM IST


ఏపీ సీఎంగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అవినీతి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాడు. తన ప్రభుత్వ హయాంలో ఎక్కడా అవినీతి అనేది జరగకూడదని ముందుగానే ఎమ్మెల్యేలకు, అధికారులకు వార్నింగ్ ఇచ్చాడు. అయితే అవినీతిని అరికట్టేందుకు తాజాగా జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలోని ప్రతి విభాగంలోనూ రివర్స్ టెండరింగ్ ప్రక్రియ జరుపుతామని తేల్చి చెప్పింది. టెండర్ విలువ కోటి దాటిన ప్రతి పనిలోనూ రివర్స్ టెండరింగ్ ఉండనుందని దీని ద్వారా అవినీతి నిర్మూలన జరుగుతుందని ఇదే గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి ఉన్న తేడా అని సీఎం జగన్ అన్నారు.

అయితే నేడు అవినీతి నిరోధక శాఖతో సమీక్ష జరిపిన సీఎం జగన్ ఎమ్మార్వో, ఎండీఓ, సబ్‌ రిజిస్ట్రార్, మున్సిపల్, టౌన్‌ ప్లానింగ్‌ విభాగాల్లో అవినీతిపై ప్రత్యేక దృష్టి సారించాలని లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికితే నిర్దిష్ట సమయంలో చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేకాదు ఇందుకు సంబంధించిన దిశ చట్టం తరహాలోనే అసెంబ్లీలో బిల్లు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇకపోతే 1902 నెంబర్‌కు వచ్చే అవినీతి సంబంధిత అంశాలూ ఏసీబీకి చెందిన 14400కు బదలాయింపు చేయాలని నిర్ణయించారు.