గ్రామ, వార్డు వాలంటీర్లకు షాక్ ఇచ్చిన జగన్ సర్కార్..!

Tuesday, December 8th, 2020, 06:53:21 PM IST

ఏపీలోని గ్రామ, వార్డు వాలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఒకింత షాక్ ఇచ్చింది. నవరత్నాల అమలులో భాగంగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేసేందుకు ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున వాలంటీర్లను నియమించింది.

అయితే గ్రామ, వార్డు వాలంటీర్లుగా ఉద్యోగం చేస్తున్న వారిలో 18 సంవత్సరాలలోపు వయసు కలిగిన వారితోపాటు, 35 సంవత్సరాల వయసు నిండిన వారిని తక్షణమే విధుల నుంచి తొలగించాల్సిందిగా గ్రామ వలంటీరు సచివాలయం, వార్డు వలంటీరు సచివాలయం శాఖ డైరెక్టర్‌, కమీషనర్‌ జీఎస్‌.నవీన్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇప్పటికే 35 ఏళ్లు నిండి వాలంటీరుగా ఉద్యోగం చేస్తున్న వారికి సీఎఫ్ఎంఎస్ ద్వారా జీతాలు రావడం లేదు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 35 ఏళ్లు నిండిన వలంటీర్ల నియామకం జరిగిన దృష్ట్యా వారిని విధుల నుంచి తొలగించాలని, ఆ ఖాళీల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.