అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణం..!

Wednesday, January 20th, 2021, 11:17:45 PM IST


అగ్ర దేశం అమెరికాకు 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. భార్య సమక్షంలో కుటుంబానికి చెందిన పురాతన బైబిల్‌ సాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ బైడెన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే 78 ఏళ్ల వయసులో జో బైడెన్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. అమెరికా చరిత్రలోనే అత్యంత పెద్ద వయసులో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా జో బైడెన్ కొత్త రికార్డు సృష్టించాడు. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి ఆ దేశ మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, జార్జ్ బుష్ కుటుంబ సభ్యులు హాజర్ కాగా, తాజా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మాత్రం బైడెన్‌ ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారు.

అయితే ప్రమాణ స్వీకారం అనంతరం జో బైడెన్ మాట్లాడుతూ అమెరికాలో కొత్త చరిత్ర ప్రారంభమైందని, అమెరికాలో ప్రజాస్వామ్యం బలంగా ఉందని, ఎన్నో సవాళ్లను అధిగమించి అమెరికా ఎదిగిందని అన్నారు. ఇటీవల పార్లమెంట్‌పై దాడి దురదృష్టకరమని అన్నారు. వివక్షకు ఈ దేశంలో స్థానం లేదని, శ్వేతవర్ణ అహంకారాన్ని తప్పకుండా ఓడిస్తామని చెప్పుకొచ్చారు. అంతేకాదు మంచి ప్రపంచం కోసం మనమందరం పాటుపడదామని అన్నారు. కరోనా వల్ల ఆర్థిక రంగం కుదేలయ్యిందని, కరోనా వల్ల మిలియన్ల సంఖ్యలో ఉద్యోగాలు పోయాయని, కరోనా నుంచి త్వరలోనే బయటపడతామని ఈ ప్రయత్నంలో మీ సహకారం కావాలని, సవాళ్లను ఐక్యమత్యంగా ఎదురుకుందామని బైడెన్ అన్నారు. ప్రజాస్వామ్యం అత్యంత విలువైనదని అమెరికా బలంగా నమ్మిందని అన్నారు. అమెరికాను అన్ని విధాలుగా మెరుగుపర్చాలని చెప్పుకొచ్చారు. ఇక ఉపాధ్యాక్షురాలిగా కమల హారిస్ ప్రమాణ స్వీకారం అమెరికాకే గర్వ కారణమని బైడెన్ చెప్పుకొచ్చారు.