తెలంగాణలో జనవరి 2 నుంచి తెరుచుకోనున్న ఇంటర్ కాలేజీలు..!

Saturday, December 19th, 2020, 06:45:59 PM IST

కరోనా కారణంగా రాష్ట్రంలో మార్చి 16 నుంచి స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. అయితే విద్యా సంవత్సరం ముగియడానికి మరి కొద్ది నెలలే మిగలడంతో తెలంగాణ ప్రభుత్వం స్కూళ్ళు, కాలేజీలు వీలైనంత త్వరగా రీ ఓపెన్ చేయాలని భావిస్తుంది. ఈ తరుణంలో జూనియర్ కాలేజీలపై విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

అయితే జనవరి 2వ తేదీ నుంచి రాష్ట్రంలో ఉన్న అన్ని జూనియర్‌ కాలేజీలను తిరిగి ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇటీవలే జేఈఈ మెయిన్‌ పరీక్ష తేదీలను కూడా ప్రకటించడంతో కనీసం మూడు నెలలైనా విద్యార్థులకు తరగతి గది బోధన ఉండాలని అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయమై అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపారని, ప్రాక్టికల్‌ ఎగ్జామ్స్ విషయంలోనూ కొంత వెసులుబాటు ఇవ్వాలని.. ప్రశ్నపత్రాల్లో కొంత ఛాయిస్‌ పెంచాలని అధికారులు యోచిస్తున్నట్టు తెలుస్తుంది.