‘విరాట్’ ఇక ఆంధ్రప్రదేశ్ సొంతం..!

Tuesday, February 9th, 2016, 03:20:47 PM IST


ఐఎన్ఎస్ విరాట్ ఇకపై ఆంద్రప్రదేశ్ సొంతం కాబోతోంది. ఇదో భారీ యుద్ద నౌక. ఎప్పుడూ సముద్రంలోనే ఉంటూ యుద్ద నౌకలను మోస్తుంటుంది ఈ విరాట్. బ్రిటీషర్స్ భారత్ కోసం తయారు చేసిన ఆఖరి యుద్ద నౌక ఇదే. పైగా ప్రపంచంలో యుద్ద విమానాలను మోసే అత్యంత పాత నౌక కూడా ఇదే. 1987 లో సముద్రంలోకి ప్రవేశించిన ఈ నౌక నిర్విరామంగా ఇప్పటి వరకూ భారత్ రక్షణ రంగానికి తన సేవలనందిస్తోంది. ఈ 2016 లోనే ఈ నౌక తన భాద్యతల నుండి తప్పుకోనుంది. ఈ విషయాన్నేగమనించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల వద్దకు ఓ ప్రతిపాదనను తీసుకెళ్ళారు. భాద్యతల నుండి తప్పుకున్న అనంతరం ఆ నౌకను ఎపీకి ఇవ్వాలని కోరారు. ఆ నౌకను వైజాగ్ తీరంలో టూరిజం అభివృద్ధి చెందడానికి వినియోగించుకుంటామని తెలిపారు.

ఈ అంశం పై మాట్లాడిన చంద్రబాబు ‘ఈ నౌకను సరిగ్గా మరమ్మత్తులు చేస్తే 1500 గదులు తయారవుతాయి. వాటిని అందగా అలంకరిస్తే పెద్ద ఫ్లోటింగ్ హోటల్ తయారవుతుంది. ఈ నౌకపై ఒకేసారి 20 హెలికాఫ్టర్లు, 8 విమానాలు దిగే అవకాశముంది. దీనిలో ఉండే కాన్ఫరెన్స్ హాల్లో 500 మంది ఒకేసారి సమావేశమయ్యే అవకాశముంది’ అన్నారు. ఇక ఈ విరాట్ సామర్థ్యం విషయానికొస్తే 743 అడుగుల పొడవు ఉండి .. ఫుట్ బాల్ మైదానమంత డెక్ ను కలిగి ఉండే ఇది గంటకు 53 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. బాబు పధకం ప్రకారం విరాట్ గనక ఏపీ సొంతమైతే.. విశాఖ తీరంలో పర్యాటక రంగ అభివృద్ధి వేగవంతమవటం ఖాయం.