జనసేన పార్టీలో ఈ నాయకుడు లేనట్టేనా..?

Sunday, May 31st, 2020, 09:06:59 AM IST

గత ఏడాది సార్వత్రిక ఎన్నికలలో ఎన్నో అంచనాల నడుమ పోటీ చేసిన పార్టీ జనసేన పార్టీ. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఊహించని స్థాయి పరాభవాన్ని ఆపార్టీ ఎన్నికలలో చవి చూసింది. అయితే మరీ పరువు పోకుండా కేవలం ఒక్క సీటు మాత్రమే నెగ్గి అసెంబ్లీ లో జనసేన పార్టీ తరపు నుంచి గొంతు వినిపిస్తుంది అనుకున్నారు.

రాజోలు నియోజకవర్గ పరిధిలో గెలిచిన రాపాక వరప్రసాద్ రావు గెలుపును పవన్ గెలుపు లానే భావించి పవన్ అభిమానులు ఆనందపడ్డారు. అయితే రాపాక వ్యవహారం మొదట్లో తటస్థంగా ఉన్నా ఆ తర్వాత మాత్రం మెల్లగా రెండు నాలుకలు ధోరనిలా మారడం ప్రారంభం అయ్యింది.

దీనితో అతనిపై మొదట అభిమానుల్లో వ్యతిరేక భావం పెరిగింది. అయినప్పటికీ రాపాక తీరు మారకపోవడంతో జనసేన అధిష్టానమే పక్కన పెట్టేసినట్టు అనిపిస్తుంది.ముఖ్యంగా ఈ కరోనా సమయంలో జనసేన కు చెందిన అనేక మంది నేతలు పలు కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు.

కానీ ఎమ్మెల్యే హోదాలో ఉన్న రాపాక మాత్రం అసలు అతని నియోజకవర్గంలో కూడా ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. పార్టీ అధ్యక్షునిగా పవన్ కూడా రాపాకకు ఎలాంటి సూచనలు కూడా చెయ్యకుండా వదిలేసినట్టున్నారు. ఎలాగో రాపాక తనకి నచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి జనసేన కూడా ఆయన్ను పక్కన పెట్టేసినట్టే ఉన్నారని చెప్పాలి.